యాసంగి వడ్ల కొనుగోలు టార్గెట్‌‌ 90 లక్షల టన్నులు..రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు : మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి

యాసంగి వడ్ల కొనుగోలు టార్గెట్‌‌ 90 లక్షల టన్నులు..రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు : మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి
  • 60 లక్షల టన్నుల దొడ్డు, 30 లక్షల టన్నుల సన్నరకాలు కొనాలని లక్ష్యం
  • 54.48 లక్షల ఎకరాల్లో వరి సాగు, 152.03 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
  • యాసంగి కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  యాసంగి సీజన్‌‌లో ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సీజన్‌‌లో 90 లక్షల టన్నుల వడ్లు సేకరించాలని సివిల్‌‌ సప్లై డిపార్ట్‌‌మెంట్‌‌కు సర్కార్‌‌ టార్గెట్‌‌ విధించింది. ఇందులో 60 లక్షల టన్నుల దొడ్డు రకం, మిగతా 30 లక్షల టన్నుల సన్నరకం వడ్లను కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించింది.

ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పంట అమ్మకం టైంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు, మౌలిక వసతులు కల్పించాలని, యంత్రాలు అందుబాటులో ఉంచాలని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు.

152 లక్షల టన్నుల దిగుబడి అంచనా

ఈ యాసంగి సీజన్‌‌లో రాష్ట్రవ్యాప్తంగా 54.48 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దీంతో ఈ సారి సుమారు 152.03 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో 90 లక్షల టన్నుల వడ్లు కొనాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్ల సన్నాహాలు, లక్ష్యాలపై సోమవారం హైదరాబాద్‌‌లో సివిల్‌‌ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి రివ్యూ నిర్వహించారు. సమావేశానికి సివిల్‌‌ సప్లై కమిషనర్‌‌ స్టీఫెన్‌‌ రవీంద్రతో పాటు అడిషనల్‌‌ కలెక్టర్లు, డీఎస్‌‌వోలు, మార్కెటింగ్‌‌ మేనేజర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యతా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు తక్షణమే చెల్లింపులు జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే వాటిని పరిష్కరించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ధాన్యం సేకరణ  ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి స్పష్టం చేశారు. యాసంగి సీజన్‌‌లో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు ఈ సమీక్ష సమావేశం మార్గం సుగమం చేసిందని అధికారులు చెప్పారు.